ఒక్కడు... మూడు గవర్నమెంట్ జాబ్స్ కొట్టాడు!

  • ఏపీ డీఎస్సీలో మేటి ప్రదర్శన చూపిన నాగరాజు
  • మూడు విభిన్న కేటగిరీల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల కోసం అర్హత సాధించిన నాగరాజు
  •  ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ (తెలుగు) చేస్తున్న నాగరాజు
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గొప్ప విషయమే. కానీ, ఒకే వ్యక్తి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం అరుదైన విషయం. ఈ అరుదైన ఘనతను సాధించారు పార్వతీపురం మన్యం జిల్లా, బలిజిపేట మండలం, పెదపెంకి గ్రామానికి చెందిన సారిపల్లి నాగరాజు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఆయన మూడు విభిన్న కేటగిరీల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

మూడు విభాగాల్లో ప్రతిభ

సారిపల్లి నాగరాజు మూడు విభాగాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. పీజీటీ (PGT)లో వందకు 83 మార్కులు సాధించి విజయనగరం జిల్లాలో 3వ స్థానం, రాష్ట్రవ్యాప్తంగా 6వ ర్యాంకు సాధించారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విభాగం పరీక్షలో 88.82 మార్కులు సాధించి విజయనగరం జిల్లాలో 2వ స్థానం, రాష్ట్రంలో 6వ ర్యాంకు సాధించారు. టీజీటీ (TGT) – జోన్-1లో జోన్ స్థాయిలో 6వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంకు సాధించారు.

విద్యాభ్యాసం – సేవాభావం

రైతు కుటుంబానికి చెందిన నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ (తెలుగు) చేస్తున్నారు. అంతకు ముందు అక్కడే ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు పూర్తిచేశారు. చిన్నతనం నుంచే కథలు, కవితలు రాయడం, పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడం పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్న ఆయన, విద్యా రంగంలో స్థిరపడుతూ పేద విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 


More Telugu News