క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య.. కూకట్‌పల్లి కేసులో షాకింగ్ నిజాలు

  • పక్కింటి మైనర్ బాలుడి దారుణం
  • దొంగతనం అడ్డుకోవడంతో కత్తితో దాడి
  • మూడు రోజులుగా బ్యాట్‌పై కన్నేసిన నిందితుడు
  • కేసు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ పోలీసులు
  • తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించిన బాలుడు
కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఖరీదైన క్రికెట్ బ్యాట్ కోసం... పక్కింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు విని అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి మీడియాకు తెలియజేశారు.

నిందితుడైన బాలుడు కొద్ది రోజులుగా సహస్ర ఇంట్లోని క్రికెట్ బ్యాట్‌పై కన్నేశాడు. ఆ బ్యాట్‌ను ఎలాగైనా దొంగిలించాలని మూడు రోజులుగా పథకం వేశాడు. ఇందులో భాగంగా, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అనుకున్న విధంగానే బ్యాట్‌ను తీసుకుని వెళుతుండగా సహస్ర అతడిని గమనించి అడ్డుకుంది.

బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన బాలుడి చొక్కాను సహస్ర గట్టిగా పట్టుకుంది. దీంతో భయపడిపోయిన నిందితుడు బాలికను బలంగా పక్కకు నెట్టేశాడు. ఈ క్రమంలో సహస్ర మంచంపై పడిపోయింది. ఆ తర్వాత నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడి నుంచి బ్యాట్‌తో సహా పరారయ్యాడు.

తొలుత ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు సీపీ తెలిపారు. అయితే, లోతైన దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. నిందితుడు పాఠశాలకు కూడా సరిగా వెళ్లడని, అతని ప్రవర్తనపై ఆరా తీస్తున్నామని పోలీసులు వివరించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లి, సంగీత్‌నగర్‌లో హత్యకు గురైన బాలిక ఇంటి సమీపంలోని అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటున్నారు. కుటుంబ పెద్ద కిరాణా దుకాణం నడిపి, నష్టాలు రావడంతో మూసివేశాడు. ఆయన భార్య గచ్చిబౌలిలోని ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తున్నారు.


More Telugu News