కేసీఆర్ పాలనను, ఇప్పటి పాలనను పోల్చుతూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • ఎరువుల కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్
  • కేసీఆర్ హయాంలో రైతులు ఏనాడూ రోడ్డెక్కలేదన్న కేటీఆర్
  • యూరియా కోసం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు వేసేవారని వెల్లడి
  • ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు అని ఆరోపణ
  • రైతులను ఇబ్బంది పెట్టేవారి పతనం ఖాయమంటూ హెచ్చరిక
తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారని, కానీ ప్రస్తుత పాలనలో అన్నదాతలు రోడ్డెక్కే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారని, ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్కసారి కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కలేదని ఆయన గుర్తుచేశారు. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ముందుచూపు అంటే అంటూ కేసీఆర్ పాలనలో తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.

కేసీఆర్ నాయకత్వ పటిమను, ఆయన ముందుచూపును కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు. "సీజన్‌కు ముందే వ్యవసాయ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి, కేంద్రానికి కచ్చితమైన లెక్కలతో వినతులు పంపేవారు. ఏపీలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి 25 ప్రత్యేక గూడ్స్ రైళ్లను ఏర్పాటు చేయించేవారు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్ర రవాణా మంత్రులతో నేరుగా సంప్రదించి సుమారు 4 వేల లారీలను సిద్ధం చేసి, పోర్టుల నుంచి నేరుగా మండలాలకు యూరియా చేరేలా పక్కా ప్రణాళికలు రచించేవారు" అని కేటీఆర్ తెలిపారు.

"పరిపాలన చేతకాని అసమర్థులు రాష్ట్రాన్ని ఏలడం వల్లే రైతులకు ఈ కన్నీళ్లు మిగిలాయని" కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. "ఒకవైపు కేసీఆర్ వందేళ్ల విజన్‌తో పనిచేస్తే, మరోవైపు కొందరికి విమర్శలు చేయడం తప్ప పనులు చేయడం రాదని ప్రజలు గ్రహించారని" అన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారి పతనం ప్రారంభమైందని ఆయన హెచ్చరించారు. "జై కిసాన్.. జై కేసీఆర్" నినాదంతో తన వ్యాఖ్యలను ముగించారు. 


More Telugu News