2 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు: అనంత వెంకట్రామిరెడ్డి

  • 14 నెలల్లో 4.15 లక్షల పింఛన్లు తొలగించారని అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపణ 
  • అనంతపురం జిల్లాలో ఈ నెలలోనే 9,601 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారని మండిపాటు 
  • దివ్యాంగుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని వెల్లడి
రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు అందిస్తున్న సామాజిక పింఛన్లలో కూటమి ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తోందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

గత 14 నెలల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.15 లక్షల పింఛన్లను తొలగించారని, ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లపై దృష్టి సారించారని ఆయన ఆరోపించారు. వచ్చే నెల నుంచి దాదాపు 2 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని మండిపడ్డారు. రీ-వెరిఫికేషన్, సదరం క్యాంపుల నుంచి కొత్త ధృవపత్రాలు తేవాలనే నిబంధనలతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

అనంతపురం జిల్లాలోనే ఈ ఏడాది 19 వేలకు పైగా పింఛన్లు తొలగించారని, ఈ నెలలోనే 9,601 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. మరో 2,314 మందిని దివ్యాంగుల కోటా నుంచి వృద్ధాప్య పింఛన్ల కేటగిరీకి మారుస్తున్నామని నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల తొలగింపుపైనే దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, దివ్యాంగుల పక్షాన వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. 


More Telugu News