హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌ రావుకు చుక్కెదురు

  • కాళేశ్వరం నివేదికపై కేసీఆర్, హరీశ్‌ కు ఎదురుదెబ్బ
  • పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు... పిటిషనర్లు కోరినట్లుగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలకు తాత్కాలికంగా నిరాశే తప్పలేదు.

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వాదనలు వినిపించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తొలుత శాసనసభలో ప్రవేశపెడతామని, ఆ తర్వాతే దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన కోర్టుకు వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానానికి స్పష్టంగా తెలియజేశారు.

మరోవైపు, ఈ నివేదిక ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్నట్లయితే, దానిని తక్షణమే తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం గమనార్హం. 


More Telugu News