జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి చూపిస్తాం: రోజా

  • ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే కూటమి అధికారంలోకి వచ్చిందన్న రోజా
  • ప్రజలను చంద్రబాబు సర్కారు దొంగ దెబ్బ తీసిందని మండిపాటు
  • మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ‘జగన్ 2.0’ అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు.

అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగన్ అందించిన సంక్షేమం, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెట్టి, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

"ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం వల్లే కూటమి గెలిచింది. కానీ, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాకు కచ్చితంగా అవకాశం ఇస్తారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇప్పుడు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారందరూ భవిష్యత్తులో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు" అని రోజా హెచ్చరించారు.


More Telugu News