రింకూ సింగ్ విధ్వంసం.. 48 బంతుల్లోనే 108 పరుగులు

  • యూపీ టీ20 లీగ్‌లో రింకూ సింగ్ విధ్వంసకర శ‌త‌కం
  • కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులతో అజేయ ఇన్నింగ్స్
  • రింకూ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు
  • 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఒంటరి పోరాటం
  • మీరట్ మావెరిక్స్ జ‌ట్టు ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం
ఆసియా క‌ప్ కోసం భారత జట్టుకు ఎంపికైన ఆనందాన్ని టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ మైదానంలో చూపించాడు. యూపీ టీ20 లీగ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి, తన జట్టుకు ఒంటిచేత్తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న కొన్ని గంటల్లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

గురువారం ఏకానా స్టేడియంలో మీరట్ మావెరిక్స్, గోరఖ్‌పూర్ లయన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ 167 పరుగులు చేసింది. అనంత‌రం 168 పరుగుల లక్ష్యఛేదనలో మీరట్ జట్టు కేవలం 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి ఖాయం అనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రింకూ సింగ్, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

గోరఖ్‌పూర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రింకూ, కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. 225 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. సహాబ్ యువరాజ్ (22)తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 65 బంతుల్లోనే అభేద్యంగా 130 పరుగులు జోడించి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే మీరట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకుముందు, గోరఖ్‌పూర్ లయన్స్ జట్టులో కెప్టెన్ ధ్రువ్ జురెల్ (38), అక్షదీప్ నాథ్ (23), నిశాంత్ కుష్వాహా (37) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయినప్పటికీ రింకూ సింగ్ వీరవిహారం ముందు ఆ స్కోరు నిలబడలేదు.




More Telugu News