ఆసీస్ టూర్‌కు రోహిత్ స్పెషల్ ప్లాన్.. ఇండియా-ఏ తరఫున బరిలోకి?

  • ఆస్ట్రేలియా టూర్‌కు సన్నద్ధతగా ఇండియా-ఏ జట్టుతో క‌లిసి ఆడనున్న రోహిత్
  • సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈ నిర్ణయం
  • సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఆస్ట్రేలియా-ఏతో మూడు అనధికారిక వన్డేలు
  • 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడన్న మహమ్మద్ కైఫ్
  • రోహిత్ తర్వాత శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని జోస్యం
భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే కీలక సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు హిట్ మ్యాన్ ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా-ఏ జట్టు తరఫున బరిలోకి దిగి మ్యాచ్ ప్రాక్టీస్ పొందాలని రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ఇండియా-ఏ మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనడం ద్వారా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని రోహిత్ యోచిస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఐపీఎల్ 2025 తర్వాత రోహిత్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. చివరిసారిగా మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున బరిలోకి దిగాడు.

ఇదిలా ఉండగా.. హిట్‌మ్యాన్‌ కెరీర్ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న రోహిత్, వన్డేల నుంచి ఎప్పుడు రిటైర్ అవుతాడనే దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ ఆటకు వీడ్కోలు పలుకుతాడని జోస్యం చెప్పాడు.

రోహిత్ స్థానాన్ని శుభ్‌మన్ గిల్ భర్తీ చేస్తాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. "గత మూడేళ్లలో గిల్ 2,000 పరుగులు చేశాడు. అతనే మన భవిష్యత్ కెప్టెన్. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా, టీ20 వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్‌కు దాదాపు 38 ఏళ్లు. 2027 ప్రపంచకప్ తర్వాత అతను తప్పుకుంటే, గిల్ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వివరించాడు. 

ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టును నడిపించి సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించిన గిల్, ఆసియా కప్‌కు టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇది భవిష్యత్ నాయకుడిగా అతని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.


More Telugu News