రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు

  • అద్దంకి సమీపంలో అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కోవూరు పోలీసు స్టేషన్ కు అరుణ తరలింపు
  • ఓ ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరుణ అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  నిడిగుంట అరుణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని  టోల్‌ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

కోవూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసులో అరుణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పడుగుపాడులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని లక్ష రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అరెస్ట్ అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

గూడూరుకు చెందిన జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు ప్రియురాలిగా అరుణ సుపరిచితురాలు. గత ప్రభుత్వ హయాంలో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఆమె అనేక సెటిల్మెంట్లు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించినా, ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించారని కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో  ప్రభుత్వం పెరోల్‌ను రద్దు చేసింది. అప్పటి నుంచి అరుణ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

అరెస్ట్‌కు ముందు అరుణ విడుదల చేసిన ఓ వీడియోలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. "పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని, కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు" అని ఆమె ఆరోపించారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం, అరుణ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అరుణకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏయే వివాదాల్లో పాలుపంచుకున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.


More Telugu News