మోదీ అంటే భయమా లేక భక్తా?.. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు పత్తా లేకుండా పోయారు: రేవంత్ రెడ్డి

  • తెలంగాణకు యూరియాను మోదీ అడ్డుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి
  • ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదని ఆవేదన
  • మోదీ భజనలో తెలంగాణ కేంద్ర మంత్రులు బిజీ అని విమర్శ
తెలంగాణ రైతాంగం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాను ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని, ఇది తెలంగాణపై ఆయనకున్న వివక్షకు నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సరిపడా యూరియాను పంపించాలని లేఖలు, విజ్ఞప్తుల రూపంలో ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి స్పందన రావడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఈ మొండి వైఖరిని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో గట్టిగా ఎండగట్టారని ఆయన ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలిచి, రైతుల పక్షాన గొంతు విప్పిన ఎంపీ ప్రియాంక గాంధీకి ఆయన 'ఎక్స్' వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన వారు, తమ బాధ్యతను మరిచి కేవలం మోదీ భజనకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. 

మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీల తీరుపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "గల్లీలో లొల్లి చేసే బీఆర్ఎస్ నేతలు, ఢిల్లీలో రైతుల సమస్యలపై మోదీని ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మోదీ అంటే భయమా లేక భక్తా?" అని సీఎం నిలదీశారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు కనిపించకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు.


More Telugu News