'కాంత'పై కన్నులెన్నో .. భాగ్యశ్రీ దశ తిరిగేనా?

  • భాగ్యశ్రీ బోర్సే కి విపరీతమైన క్రేజ్
  • ఇంతవరకూ దక్కని హిట్
  • 'కాంత'పైనే అన్ని ఆశలు 
  • సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్
  • 1950లలో నడిచే కథా నేపథ్యం

తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల నాయిక భాగ్యశ్రీ బోర్సే. ముందుగా బాలీవుడ్ వైపు నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. తెలుగులో ఆమె చేసిన 'మిస్టర్ బచ్చన్' అంతగా ఆడలేదు. ఆ సినిమా కథను మరిచిపోయినంత తేలికగా ప్రేక్షకులు ఆమె గ్లామర్ ను మరచిపోలేకపోయారు. ఆమెకి గల ఆ క్రేజ్ కారణంగానే 'కింగ్ డమ్'లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే భాగ్యశ్రీ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. 

నిజానికి తెలుగు ఇండస్ట్రీలోకి సరైన సమయంలో భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హీరోయిన్స్ వైపు నుంచి పెద్దగా పోటీలేదు. పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ జోరు లేదు. కెరియర్ పరంగా శ్రీలీల ఇంకా తడబడుతూనే ఉంది. ఈ సమయంలో భాగ్యశ్రీ గ్లామర్ కి హిట్ తోడైతే బాగానే ఉండేది కానీ, అందుకు ఆమె చాలా దూరంలోనే ఉంది. అయితే 'కాంత' సినిమాతో ఆమె దశ తిరిగిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె దుల్కర్ సల్మాన్ జోడీగా కనిపించనుంది. తమిళంతో పాటు ఈ సినిమా తెలుగు .. కన్నడ భాషల్లోను విడుదల కానుంది. తమిళ .. కన్నడ భాషా ప్రేక్షకులకు ఆమె పరిచయమవుతున్న సినిమా ఇదే. 1950 కాలం నాటి కథా నేపథ్యంలో .. మద్రాస్ వేదికగా ఈ సినిమా నడుస్తుంది. 'కాంత'లో భాగ్యశ్రీకి గ్లామర్ తో పాటు నటనకి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. అందువలన ఈ సినిమాతో ఆమె కెరియర్ పుంజుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.



More Telugu News