దసరాకు ఊరెళుతున్నారా? చౌకగా రైలులో వెళ్లిరండి.. ఎలాగంటే!
- రానూపోనూ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 20 శాతం తగ్గింపు
- పండుగ సీజన్ కు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ఆఫర్
- ఫెస్టివల్ రౌండ్ ట్రిప్ ఆప్షన్ తీసుకొచ్చిన అధికారులు
దసరాకు సొంతూరుకు వెళ్లాలనుకునే వారికోసం రైల్వే శాఖ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రైలు ప్రయాణం మరింత చౌకగా మార్చింది. రానూపోనూ టికెట్ బుక్ చేసుకుంటే 20 శాతం రాయితీ పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ ను అక్టోబర్ 13 నుంచి 26 తేదీలతో (ఆన్ వార్డ్) పాటు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1వ తేదీల్లో (రిటర్న్) ప్రయాణాలకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఐఆర్ సీటీసీ మొబైల్ యాప్ ‘రైల్ కనెక్ట్’ లో టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా ఈ రాయితీ పొందవచ్చని చెప్పారు. పండుగకు ఎలాంటి టెన్షన్ లేకుండా, రాయితీపై ప్రయాణించేందుకు రైల్వే శాఖ అందిస్తున్న ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
ముఖ్యమైన సూచనలు..
ముఖ్యమైన సూచనలు..
- పండుగల వేళ నిర్ణీత తేదీలలో ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
- రానూపోనూ ప్రయాణాలకు ఒకేసారి బుకింగ్ చేసుకుంటేనే 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
- ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాక ‘బుక్ రిటర్న్ జర్నీ (20% డిస్కౌంట్)’ ఆప్షన్ ద్వారా తిరుగు ప్రయాణానికి బుకింగ్ చేసుకోవాలి.
- తొలుత బుక్ చేసుకున్న స్టేషన్లను సిస్టం ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సోర్స్, డెస్టినేషన్ స్టేషన్లను కానీ, ప్రయాణికుల పేర్లు కానీ మార్చుకునే అవకాశంలేదు.
- ఊరు వెళ్లే తేదీలు అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, తిరుగు ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 తేదీల మధ్య ఉండాలి.