నాగార్జునకు 'గీతాంజలి' గిరిజ వీడియో చూపించిన జగపతిబాబు.. గుర్తుపట్టనంతగా మారిపోయిన గిరిజ

  • నాగార్జునకు సర్‌ప్రైజ్‌గా గిరిజ వీడియో బైట్ ప్రదర్శించిన జగపతిబాబు
  • 'గీతాంజలి'తోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన గిరిజ
  • గిరిజ మారిపోయినా నాగ్ మారలేదన్న జగ్గూభాయ్ 
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన నటి గిరిజ. ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'గీతాంజలి' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఆమె, చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె రూపం చూసి అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె తాజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటుడు జగపతి బాబు కొత్తగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తొలి అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా, నాగార్జునకు సర్‌ప్రైజ్ ఇస్తూ జగపతి బాబు... 'గీతాంజలి' హీరోయిన్ గిరిజతో రికార్డ్ చేసిన ఒక ప్రత్యేక వీడియో బైట్‌ను ప్లే చేశారు.

ఆ వీడియోలో కనిపించిన గిరిజను చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ముఖంపై ముడతలు, వయసు పైబడిన ఛాయలతో ఆమె కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె తాజా ఫొటోలు వైరల్ అయ్యాయి. 66 ఏళ్ల వయసులోనూ నాగార్జున యంగ్‌గా కనిపిస్తుండగా, గిరిజలో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన తర్వాత జగపతి బాబు కూడా 'గిరిజ మారిపోయింది... కానీ నువ్వింకా మారలేదు' అని నాగార్జునతో సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ వీడియోలో గిరిజ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు. తన మొదటి సినిమా నాగార్జునతో చేయడం తన అదృష్టమని తెలిపారు. సినిమా విడుదలయ్యాక తన నటనను నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. "నాగార్జున ఒక లెజెండ్‌కు ఏమాత్రం తక్కువ కాదు" అని ఆమె పేర్కొన్నారు.

'గీతాంజలి' సినిమాతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న గిరిజ, ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన విజయం సాధించలేకపోయారు. అనంతరం ఆమె నటనకు పూర్తిగా దూరమయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇలా కెమెరా ముందు కనిపించడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News