కొందరు సెలబ్రిటీలు కాసులకు కక్కుర్తి పడుతున్నారు.. రజనీకాంత్ నిజమైన సూపర్‌స్టార్: సజ్జనార్

  • సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వీసీ సజ్జనార్ ప్రశంసల వర్షం
  • రజనీనే నిజమైన సూపర్ స్టార్ అంటూ కితాబు
  • 50 ఏళ్ల కెరీర్‌లో ఒక్క వాణిజ్య ప్రకటనలో నటించకపోవడం గొప్ప విషయం
  • అభిమానులను మోసం చేయకూడదనే రజనీ నిర్ణయం అభినందనీయం
  • డబ్బు కోసం కొందరు సెలబ్రిటీలు హానికరమైన యాడ్స్ చేస్తున్నారు
  • రజనీని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచన
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ "నిజమైన సూపర్ స్టార్" అని కొనియాడారు. ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని సజ్జనార్ అన్నారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, కేవలం డబ్బు కోసం కొందరు ప్రముఖులు సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులను, సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ధోరణితో కొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రచారం కల్పిస్తూ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

అయితే, రజనీకాంత్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని సజ్జనార్ పేర్కొన్నారు. తనను అభిమానించే వారిని మోసం చేయకూడదనే సదుద్దేశంతో వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని తెలిపారు. ప్రస్తుత తరం సెలబ్రిటీలు రజనీకాంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

"డబ్బే ముఖ్యం, సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ధోరణిని సెలబ్రిటీలు వీడాలి. రజనీగారిలా సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. ప్రజల జీవితాలతో ఆడుకునే సంస్థల ప్రచారానికి దూరంగా ఉండాలి" అని వీసీ సజ్జనార్ హితవు పలికారు.


More Telugu News