సూపర్ సిక్స్... సూపర్ ఫ్లాప్: షర్మిల

  • సీఎం చంద్రబాబు ప్రజలను ఘోరంగా మోసం చేశారని షర్మిల ఆరోపణ
  • ఏడాది పాలనలో హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజం
  • ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం హామీలు గాలికి
  • తల్లికి వందనం, రైతు పథకాలకు కోతలు పెట్టారని ఆరోపణ
  • 14 నెలల తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాలు 'సూపర్ ఫ్లాప్' అయ్యాయని, ఇది ప్రజలను ఘరానా మోసం చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

"సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారూ? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు... ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3 వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా? అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారు. 

తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి! 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం. 

చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం... అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.



More Telugu News