వరద పోటుకు మళ్లీ దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్‌ ఎగువ కాఫర్ డ్యాం

  • గత పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు
  • పోలవరం ప్రాజెక్టుకు పోటెత్తిన గోదావరి వరద
  • వరద తాకిడికి దెబ్బతిన్న ఎగువ కాఫర్ డ్యాం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వరదలు మరోసారి దెబ్బతీశాయి. గత పది రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులోని ఎగువ కాఫర్ డ్యాం పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతికి కాఫర్ డ్యాంలో కొంత భాగం కోతకు గురైనట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ తీవ్రమైన ప్రవాహం కారణంగా ఎగువ కాఫర్ డ్యాంకు సుమారు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం దెబ్బతినడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2022 ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరదలకు కూడా ఇదే తరహాలో డ్యాంకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో రిపేర్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.



More Telugu News