భారత్‌పై సుంకాలు.. ట్రంప్‌ది పెద్ద తప్పు: మాజీ సలహాదారు జాన్ బోల్టన్

  • భారత్‌పై భారీ సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయంపై జాన్ బోల్టన్ విమర్శలు
  • కీలక భాగస్వామి అయిన భారత్‌ను అనవసరంగా రెచ్చగొట్టడమేనని వ్యాఖ్య
  • రష్యా నుంచి చైనా చమురు కొన్నా.. భారత్‌పైనే కక్ష సాధింపు అని ఆరోపణ
  • దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఏళ్లు పడుతుందని బోల్టన్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌పై భారీగా సుంకాలు విధించడం ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదమని ఆయన మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తీవ్రంగా విమర్శించారు. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని, కీలక భాగస్వామి అయిన భారత్‌ను అనవసరంగా రెచ్చగొట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో 25 శాతం కేవలం రష్యా చమురు కొనుగోలుకు జరిమానాగా విధించారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. "భారత్ భారీగా రష్యా చమురు కొంటూ, దానిని బహిరంగ మార్కెట్‌లో అమ్మి పెద్ద లాభాలు గడిస్తోంది. రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నారనే దానిపై వారికి పట్టింపు లేదు" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఆరోపించారు.

అయితే, ట్రంప్ తీరును బోల్టన్ తప్పుబట్టారు. ఓ ప్రముఖ భారతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, "గత 30 రోజులుగా భారత్ పట్ల వైట్ హౌస్ వ్యవహరించిన తీరు చాలా పెద్ద తప్పు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు దెబ్బతిన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తిరిగి సంపాదించడానికి చాలా సమయం పడుతుంది" అని హెచ్చరించారు. రష్యా నుంచి చైనా కూడా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్ విషయాన్ని ప్రస్తావిస్తూ బోల్టన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ జోక్యం చేసుకున్నందుకుగానూ, 2026 నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును సిఫార్సు చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. "ప్రధాని మోదీకి నాదో సలహా.. ఆయన కూడా ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తే బాగుంటుంది" అని బోల్టన్ చురక అంటించారు. ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై అమెరికాలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనడానికి బోల్టన్ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


More Telugu News