బెంగళూరులో వైరల్ గా మారిన టూలెట్ ప్రకటన.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

  • మహిళలకు మాత్రమే.. దయగా ఉంటే చాలు మీరు దయ్యాలను పూజించినా డోంట్ కేర్
  • పొగ తాగినా, మద్యం తాగినా, మాంసాహారం తిన్నా పట్టించుకోనంటూ ప్రకటన
  • పెంపుడు జంతువులతో వస్తే సాదరంగా స్వాగతిస్తానని వెల్లడి
బెంగళూరులో ఓ మహిళ పోస్ట్ చేసిన టూలెట్ ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. సాధారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే సవాలక్ష కండీషన్లు పెట్టే యజమానులు ఇలాంటి ప్రకటన ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు అద్దె ప్రకటనలో కండీషన్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకూ అవేంటంటే.. చక్కని మూడు పడక గదుల అపార్ట్ మెంట్ లో ఓ బెడ్ రూంను అద్దెకిస్తానంటూ యువతి ప్రకటించింది.

మహిళలకు మాత్రమే అనే ప్రధాన కండీషన్ తో పాటు ‘దయగా ఉంటే చాలు మీరు దయ్యాలను పూజించినా నేను పట్టించుకోను’ అని పేర్కొంది. మీరు పొగ తాగినా, మద్యం సేవించినా, మాంసాహారం తిన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. పెంపుడు జంతువులంటే తనకు ప్రేమ అని, మీతో పాటు మీ పెట్ ను తీసుకొస్తే సంతోషిస్తానని తెలిపింది.

అదేవిధంగా, ఈ అపార్ట్ మెంట్ తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, ఫ్లాట్ మేట్ లుగా వచ్చిన వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పింది. ఈమేరకు శివానీ అనే యువతి ఎక్స్ లో ఈ యాడ్ ను పోస్ట్ చేసింది. పూర్తి ఫర్నీచర్ తో కూడిన బెడ్ రూం ఫొటోలతో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News