రెండేళ్ల వయసులో తండ్రి హత్య.. 17 ఏళ్లు ఆగి ప్రతీకారం తీర్చుకున్న కొడుకు

  • చెన్నైలో హిస్టరీ షీటర్ రాజ్ కుమార్ పట్టపగలే హత్య
  • హత్య చేసింది 19 ఏళ్ల కాలేజీ విద్యార్థి యువానేష్
  • తండ్రిని చంపిన విషయంపై రాజ్ కుమార్ ఎగతాళి చేయడమే కారణం
  • ప్రధాన నిందితుడు యువానేష్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని 17 ఏళ్లుగా రగిలిపోతున్న ఓ కొడుకు, చివరకు తన పంతం నెగ్గించుకున్నాడు. తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ హిస్టరీ షీటర్‌ (నేర చరిత్ర గల వ్యక్తి)ను పట్టపగలే దారుణంగా హత్య చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన 19 ఏళ్ల కాలేజీ విద్యార్థితో పాటు, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, చెన్నై, టీపీ ఛత్రం పరిధిలోని జోతియమ్మాళ్ నగర్‌లో రాజ్ కుమార్ (42) అనే హిస్టరీ షీటర్ నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతను తన ఇంటి బయట మోటార్‌బైక్‌ను రిపేర్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో, యువనేష్ (19) అనే బీబీఏ మొదటి సంవత్సరం విద్యార్థి తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకుని రాజ్ కుమార్‌పై ఆయుధాలతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు.

వారి నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుమార్ పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయినా, యువనేష్ గ్యాంగ్ అతడిని వదల్లేదు. ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణలో విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.

17 ఏళ్ల క్రితం, అంటే 2008లో అమింజికరై ప్రాంతంలో యువనేష్ తండ్రి సెంథిల్ కుమార్ హత్యకు గురయ్యారు. అప్పుడు యువనేష్ వయసు కేవలం రెండేళ్లు. ఆ హత్య కేసులో రాజ్ కుమార్ ప్రధాన నిందితుల్లో ఒకడు. అప్పటి నుంచి రాజ్ కుమార్‌పై పగ పెంచుకున్న యువనేష్, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే రాజ్ కుమార్.. యువనేష్‌ను అతని తండ్రి హత్య గురించి ప్రస్తావిస్తూ, హేళనగా మాట్లాడాడు. దీంతో అతనిలోని పగ మరింత తీవ్రరూపం దాల్చింది. ఏది ఏమైనా, రాజ్ కుమార్‌ను అంతమొందించి తన పగ తీర్చుకోవాలనుకుని, తన స్నేహితుల సహకారంతో రాజ్ కుమార్ ను హత్య చేశాడు.

ఈ హత్యకు సంబంధించి పోలీసులు యువనేష్‌తో పాటు అతని స్నేహితులైన సాయి కుమార్ (20), మరో 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



More Telugu News