పహల్గామ్ ఉగ్రవాది అంత్యక్రియలు.. లష్కరే కమాండర్‌పై తిరగబడిన పీవోకే ప్రజలు

  • శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రవాది హబీబ్ తాహిర్
  • పీవోకేలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వచ్చిన లష్కరే కమాండర్ రిజ్వాన్ హనీఫ్
  • స్థానికులు తిరగబడటంతో వెనుదిరిగిన వైనం
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని ఒక గ్రామంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమం సరిహద్దు ఉగ్రవాదంపై మరోమారు చర్చకు దారితీసింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందంటూ భారత్ చేస్తున్న ఆరోపణలకు మరో బలమైన సాక్ష్యం లభించింది.  
 
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ హర్వాన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హబీబ్ తాహిర్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. 

అంత్యక్రియల్లో వివాదం
జులై 30న పాక్‌లోని కుయియాన్ గ్రామంలో హబీబ్ తాహిర్ అంత్యక్రియలు జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ప్రకారం ఈ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ఈ అంత్యక్రియల్లో లష్కరే తాయిబా కమాండర్ రిజ్వాన్ హనీఫ్ తన అనుచరులతో కలిసి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. అంత్యక్రియలు చేస్తున్న వారిని హనీఫ్ మేనల్లుడు తుపాకితో బెదిరించడంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో హనీఫ్, అతడి అనుచరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

హబీబ్ తాహిర్‌ను లష్కరే తాయిబా సంస్థ రిక్రూట్ చేసి శిక్షణ ఇచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. గతంలో 'ఆపరేషన్ సిందూర్‌'లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైన్యాధికారులు హాజరయ్యారు. ఈ అంత్యక్రియలను అమెరికా నిషేధించిన గ్లోబల్ టెర్రరిస్ట్, ఎల్‌ఈడీ కమాండర్ ‘అబ్దుల్ రవూఫ్’నడిపించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలన్నీ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు ఉన్న మద్దతును స్పష్టంగా చూపిస్తున్నాయి.


More Telugu News