ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు కనిపించాడు!

  • ముంబై నుంచి ఇండిగో విమానంలో కోల్‌కతాకు హుస్సేన్ ప్రయాణం
  • అకారణంగా  ఆయన చెంపపై కొట్టిన మరో ప్రయాణికుడు
  • ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయిన హుస్సేన్
  • కోల్‌కతాలో దిగాక కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కకుండా రైలులో అస్సాంకు ప్రయాణం
ముంబై-కోల్‌కతా ఇండిగో విమానంలో దాడి ఘటన తర్వాత అదృశ్యమైన అస్సాం యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్ (32) నిన్న అస్సాంలోని బర్పేటా రైల్వే స్టేషన్‌లో కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలోని ఓ హోటల్‌లో పనిచేసే హుస్సేన్.. కేన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిని చూసేందుకు అస్సాం, సిల్చార్ సమీపంలోని కటిగోరా గ్రామానికి బయలుదేరాడు. గురువారం ఇండిగో విమానంలో ముంబై నుంచి కోల్‌కతాకు ప్రయాణించాడు.  అక్కడి నుంచి సిల్చార్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌లో వెళ్లాల్సి ఉంది. 

అయితే, విమానం టేకాఫ్ సమయంలో హుస్సేన్‌కు గుండె దడ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన ఏడుస్తూ విమానం నుంచి దిగిపోవాలని అనుకున్నాడు. క్యాబిన్ క్రూ ఆయనను శాంతపరిచేందుకు సీటు వద్దకు తీసుకెళ్తుండగా, మరో ప్రయాణికుడు హఫీజుల్ రహ్మాన్ హఠాత్తుగా హుస్సేన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

అదృశ్యం.. గుర్తింపు
కోల్‌కతాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత హుస్సేన్ తన కనెక్టింగ్ ఫ్లైట్‌ను తీసుకోకుండా కోల్‌కతా నుంచి అస్సాంకు రైలులో బయలుదేరాడు. శుక్రవారం సిల్చార్ విమానాశ్రయంలో ఆయన కోసం వేచి ఉన్న భార్య, సోదరుడు, బంధువులు ఆయన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో వైరల్ వీడియో చూసిన వారు హుస్సేన్‌కు ఫోన్‌ చేశారు. అయితే, ఆయన మొబైల్ ముంబైలోనే మిస్ అయినట్టు తెలిసింది. దీంతో ఫోన్ కలవకపోవడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు.

నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో హుస్సేన్ బర్పేటా రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు సమాచారం అందింది. కటిగోరా పోలీసు స్టేషన్ అధికారి మాట్లాడుతూ “హుస్సేన్ కోల్‌కతా నుంచి రైలు ఎక్కి బర్పేటాకు చేరుకున్నాడు. ఆయన ఇప్పుడు సిల్చార్‌కు బయలుదేరాడు” అని తెలిపారు. హుస్సేన్ నీరసంగా ఉన్నట్టు కనిపించాడని, ఆయనకు ఆహారం అందించి, సిల్చార్‌కు పంపించామని బంధువులు తెలిపారు. అదృశ్యమైన హుస్సేన్ కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


More Telugu News