ఓ మహిళ ఇంటికి వెళ్లి స్వయంగా వితంతు పింఛను అందించిన సీఎం చంద్రబాబు

  • నేడు ఒకటో తారీఖు 
  • రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సందడి
  • జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో చంద్రబాబు పర్యటన 
  • ఓ కుటుంబంతో ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం చంద్రబాబు 
ఇవాళ ఆగస్టు 1వ తేదీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సందడి నెలకొంది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి వితంతు పింఛన్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన అలివేలమ్మ కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అలివేలమ్మ పెద్ద కుమారుడు వేణుగోపాల్‌ చేనేత కార్మికుడు. సీఎం ఆయన మగ్గాన్ని పరిశీలించారు. వేణుగోపాల్‌ తన కుమారుడు హర్షవర్ధన్‌ (6)కు 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధి చేకూరినట్లు సీఎంకు వివరించారు. అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు, ఆటో డ్రైవర్‌ జగదీశ్‌తో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం, జగదీశ్‌ ఆటోలో సీఎం చంద్రబాబు ప్రజావేదిక వద్దకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరువవుతున్నాయో స్వయంగా తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు ఈ పర్యటన చేపట్టారు. ఇంటివద్దే పింఛన్‌ అందించి లబ్ధిదారుల ఇబ్బందులను తెలుసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News