Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు.. కండతడిపెడుతూ కేజ్రీవాల్‌కు కీలక సూచన

Rajesh Gupta Joins BJP Leaving Kejriwal Shocked
  • హజారే సమయంలో ఉద్యోగాలు వదిలేసిన వారిని పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శ
  • కేజ్రీవాల్ గారూ, ప్రజలు మిమ్మల్ని ఎందుకు విడిచి పెడుతున్నారో ఆలోచించాలని సూచన
  • పార్టీని వీడుతున్న వారి జాబితాలో నేనూ చేరాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాజేష్ గుప్తా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధిగా, పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా ఆయన పనిచేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు ఢిల్లీ బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నా హజారే ఆందోళన సమయంలో ఉద్యోగాలను వదిలేసిన వారిని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ నేతలు, కార్యకర్తలను వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. "అరవింద్ కేజ్రీవాల్ గారూ, ప్రజలు మిమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నారో మీరు ఆలోచించండి. నేను ఎల్లప్పుడూ మీ కోసం నిలబడ్డాను. టీవీ డిబేట్‌లలో కూడా పార్టీ తరఫున పోరాడాను" అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను, కార్యకర్తలను యూజ్ అండ్ త్రో పద్ధతిలో చూసే అలవాటు కేజ్రీవాల్ పతనానికి కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడినప్పుడు చాలామంది ప్రముఖ వ్యక్తులు కేజ్రీవాల్‌తో చేతులు కలిపారని, కానీ ఆయన అందరికీ ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారని అన్నారు. ఈరోజు దురదృష్టవశాత్తు నేను కూడా ఆ జాబితాలో చేరాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.
Arvind Kejriwal
Rajesh Gupta
AAP
BJP
Delhi Municipal Corporation
Delhi BJP

More Telugu News