DGCA: ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్ సమస్య.. భారత్‌లో 338 విమానాలపై ప్రభావం: డీజీసీఏ

DGCA says 338 Indian flights hit by Airbus software problem
  • ఎయిర్‌బస్ A320 విమానాల్లో తలెత్తిన సాఫ్ట్‌వేర్ సమస్య
  • ఈ లోపం భారత్‌లో 338 విమానాలపై ప్రభావం చూపింద‌న్న‌ డీజీసీఏ
  • ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
  • ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఆలస్యం
ఎయిర్‌బస్ A320 విమానాల్లో తలెత్తిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సమస్య భారత విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపింది. ఈ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 338 విమాన సర్వీసులు ప్రభావితమైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే, ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయమేమిటంటే వీటిలో ఇప్పటికే 270 విమానాల్లో అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పూర్తి చేసినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.

యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌బస్ A320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ తప్పనిసరి చేశారు. విమాన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో కీలకమైన 'ఎలివేటర్ అండ్ ఐలరాన్ కంప్యూటర్' (ELAC) యూనిట్‌లో లోపం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 విమానాలపై ప్రభావం పడింది.

ఈ సమస్య కారణంగా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల విమాన సర్వీసుల్లో జాప్యం జరగవచ్చని ప్రయాణికులను ముందుగానే హెచ్చరించాయి. డీజీసీఏ గణాంకాల ప్రకారం ఇండిగోకు చెందిన 200 విమానాలు ప్రభావితం కాగా, వాటిలో 160 విమానాల్లో అప్‌డేట్ పూర్తయింది. ఎయిర్ ఇండియాకు చెందిన 113 విమానాల్లో 42, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 25 విమానాల్లో 4 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు.

ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి విమానాలను రద్దు చేయలేదు. అయితే, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 విమానాలు మాత్రం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా ఆలస్యంగా నడిచాయి. దేశంలోని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
DGCA
Airbus A320
Airbus
Software issue
Indian aviation
EASA
IndiGo
Air India
Air India Express
Flight delay

More Telugu News