WhatsApp: వాట్సాప్, టెలిగ్రామ్‌కు కేంద్రం కొత్త రూల్

WhatsApp Telegram New Rules If No Active SIM App Wont Work
  • వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు కేంద్రం కొత్త నిబంధనలు
  • ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే ఈ సేవలు పనిచేయవు
  • ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకే ఈ చర్యలన్న టెలికాం శాఖ
  • వెబ్ బ్రౌజర్‌లో ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్
  • నిబంధనల అమలుకు కంపెనీలకు 90 రోజుల గడువు
భారత్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే ఈ యాప్‌లు పనిచేయకుండా నిబంధనలు తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. దేశంలో సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన "టెలికమ్యూనికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025"లో భాగంగా ఈ మార్పులు చేశారు. ఈ నిబంధనలను అమలు చేయడానికి యాప్‌లకు 90 రోజుల గడువు విధించారు.

కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్‌లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డ్‌తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలని, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ (డాట్) స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతీ సెషన్ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌తో ముడిపడి ఉంటుందని, నేరగాళ్లు రిమోట్‌గా యాప్‌లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం ఎందుకంటే..?
ప్రస్తుతం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకుంటే చాలు. ఆ తర్వాత సిమ్ కార్డ్‌ను తీసేసినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. సిమ్ బైండింగ్ ద్వారా యూజర్, వారి నంబర్, డివైజ్‌ మధ్య సంబంధాన్ని గుర్తించడం సులభమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) అభిప్రాయపడినట్టు ‘మీడియానామా’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ఇలాంటి భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి.

అయితే, ఈ నిబంధనపై నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దీనివల్ల మోసాలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని కొందరు అంటుండగా, నకిలీ లేదా దొంగిలించిన ఐడీలతో నేరగాళ్లు సులభంగా కొత్త సిమ్‌లను పొందగలరని, కాబట్టి దీనివల్ల ప్రయోజనం పరిమితమేనని మరికొందరు సైబర్ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ కొత్త నిబంధన వల్ల యూజర్లకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
WhatsApp
WhatsApp new rules India
Telegram
Telegram new rules India
Cyber security India
Cybercrime India
Messaging apps India
COAI

More Telugu News