70 దేశాలకు అధిక టారిఫ్‌తో షాకిచ్చిన ట్రంప్... పాకిస్థాన్‌కు మాత్రం తగ్గింపు

  • పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్
  • 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలను పెంచిన ట్రంప్
  • భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్
  • పాకిస్థాన్‌కు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిక సుంకాలను విధిస్తూ దాదాపు 70 దేశాలకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు టారిఫ్‌ను తగ్గిస్తూ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. 10 శాతం నుంచి 41 శాతం వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం టారిఫ్ విధించారు.

వివిధ దేశాలపై టారిఫ్‌ను భారీగా పెంచారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 25 శాతం నుంచి 35 శాతానికి పెంచారు. బ్రెజిల్‌పై ప్రస్తుతం ఉన్న పది శాతానికి 40 శాతాన్ని జత చేశారు. భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్, పాకిస్థాన్‌పై పది శాతం తగ్గించారు. ఆ దేశంపై 29 శాతంగా ఉన్న పన్నును 19 శాతానికి తగ్గించారు. జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10 శాతం సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

పరస్పర సుంకాలను సవరించడానికి, వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు ప్రకటించారు. ఈ సవరించిన టారిఫ్‌లు ఏడు రోజుల్లో అమల్లోకి రానున్నాయి. భారత్, కెనడా దేశాలకు చెందిన దిగుమతులపై విధించిన టారిఫ్ మాత్రం నేటి నుంచి అమల్లోకి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.


More Telugu News