జగన్ పర్యటనలో కానిస్టేబుల్ చేయి విరగ్గొట్టారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • నెల్లూరులో జగన్ పర్యటన 
  • పలు సంఘటనలపై కోటంరెడ్డి ఆగ్రహం
  • వైసీపీ నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
  • లా చేస్తేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని వెల్లడి 
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు. గురువారం నాడు కోటంరెడ్డి నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనుచరులు కానిస్టేబుల్ చేయి విరగొట్టారని, ప్రభుత్వాసుపత్రి గోడను కూలగొట్టారని, నడిరోడ్డుపై ధర్నాలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని ఆయన స్పష్టం చేశారు.

గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే, అది పోలీసుల వైఫల్యమంటూ ప్రభుత్వంపై నిందలు వేశారని కోటంరెడ్డి గుర్తు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటే, వాటిని ఆంక్షలంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులతో సన్నిహితంగా వ్యవహరించిన జగన్, ఆ తర్వాత వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డిని వెనకేసుకు వచ్చారని కోటంరెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మైనింగ్ ఆరోపణలు చేసిన జగన్, తన తాత వైఎస్ రాజారెడ్డి కూడా అదే వ్యాపారం చేశారని మరచిపోయారని అన్నారు. వేమిరెడ్డి గతంలో వైసీపీకి చేసిన సాయాన్ని కూడా జగన్ విస్మరించారని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ జగన్ తన వైఖరిని సమీక్షించుకొని నెల్లూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ అనుచర గణం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, వైసీపీ నాయకులకు తాము తగిన సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.




More Telugu News