ఐర్లాండ్‌లో భార‌తీయుడిపై జాత్య‌హంకార దాడి

  • డ‌బ్లిన్‌లో భార‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తిపై అక్క‌డి కొంద‌రు యువ‌కుల దాడి
  • దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ సంతోశ్‌ యాద‌వ్
  • త‌న‌పై జ‌రిగిన దాడి గురించి త‌న లింక్డిన్ ప్రొఫైల్‌లో పోస్టు చేసిన బాధితుడు
ఐర్లాండ్‌లో జాత్య‌హంకార దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. డ‌బ్లిన్‌లో భార‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తిపై అక్క‌డి కొంద‌రు యువ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. సంతోశ్‌ యాద‌వ్ అనే వ్య‌క్తి లెట్ట‌ర్‌కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాల‌జీ కంపెనీలో సీనియ‌ర్ డేటా అన‌లిస్టుగా ప‌నిచేస్తున్నారు. 

తాజాగా త‌న‌పై జ‌రిగిన దాడి గురించి ఆయ‌న‌ త‌న లింక్డిన్ ప్రొఫైల్‌లో పోస్టు చేశారు. త‌ల‌, ముఖం, మెడ‌, ఛాతి, చేతులు, కాళ్లపై యువ‌కులు దాడి చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఈ ఘ‌ట‌నపై ఆయ‌న సుదీర్ఘ‌మైన పోస్టు చేశారు.

భార‌తీయ సంత‌తి వ్య‌క్తుల‌పై ఐర్లాండ్‌లో దాడులు పెరుగుతున్న‌ట్లు అత‌ను పేర్కొన్నారు. డిన్న‌ర్ చేసిన త‌ర్వాత త‌న అపార్ట్‌మెంట్ వ‌ద్ద వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆరుగురు వ్య‌క్తులు అటాక్ చేసిన‌ట్లు సంతోశ్ యాద‌వ్ తెలిపారు. త‌న కంటి అద్దాల‌ను తీసివేసి.. నిర్దాక్షిణ్యంగా త‌ల‌, మెడ‌పై దాడి చేశార‌న్నారు. రోడ్డుపైనే ర‌క్తం కారుతున్న ద‌శ‌లో త‌న‌ను వ‌దిలేయ‌డంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశాన‌ని, వాళ్లు ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు తెలిపారు. త‌న ద‌వ‌డ ఎముక విరిగిన‌ట్లు మెడిక‌ల్ బృందం పేర్కొన్న‌ట్లు త‌న పోస్టులో తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఇదే కోవ‌లో డ‌బ్లిన్‌లోనే ఓ భార‌తీయుడిపై దాడి జ‌రిగింది. చిన్న పిల్ల‌ల‌తో అనుచితంగా ప్రవర్తించాడనే నెపంతో ఒక గుంపు భార‌త వ్య‌క్తిపై దాడికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వారం తర్వాత మ‌ళ్లీ ఇప్పుడు మ‌రో జాత్య‌హంకార దాడి వెలుగులోకి వ‌చ్చింది. 



More Telugu News