127 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు
- బ్రిటిష్ పాలనలో దేశం నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలు
- అవి తిరిగి మాతృభూమికి చేరుకున్నట్టు మోదీ ప్రకటన
- 1898లో ఉత్తరప్రదేశ్‌లోని పిపర్‌వాహలో తవ్వకాల్లో బయటపడిన గౌతముడి అవశేషాలు
"ఈ చారిత్రక సంఘటన భారతదేశానికి, మన సాంస్కృతిక వైభవానికి గర్వకారణం. బుద్ధుడి పవిత్ర అవశేషాలు మన దేశంతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని, ఆయన ఉన్నత బోధనలను ప్రతిబింబిస్తాయి" అని ప్రధాని మోదీ తెలిపారు. 1898లో ఉత్తరప్రదేశ్‌లోని పిపర్‌వాహలో (భారత్-నేపాల్ సరిహద్దు సమీపం) జరిగిన పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో ఈ అమూల్యమైన అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ బుద్ధుడి అస్థి అవశేషాలతో పాటు విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఈ తవ్వకాల్లో లభ్యమయ్యాయి.
అయితే, బ్రిటిష్ పాలనలో ఈ అపరూప సంపద దేశం నుంచి తరలిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక అంతర్జాతీయ వేలంలో ఈ అవశేషాలు మళ్లీ కనిపించగా, వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. "ఈ అవశేషాల తిరిగి రాక భారతదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక గొప్పతనాన్ని పునరుద్ఘాటిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.