డీప్ ఫేక్.. తేడా గుర్తించండంటూ తెలంగాణ పోలీసుల హెచ్చరిక

  • ప్రతి వీడియోను ఫార్వార్డ్ చేయవద్దని సూచన
  • మార్ఫింగ్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ పోలీసులు
  • ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేసిన తెలంగాణ పోలీసులు
సామాజిక మాధ్యమాలలో కనిపించే ప్రతి వీడియోను గుడ్డిగా ఫార్వార్డ్ చేయవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు అధికంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

"సోషల్ మీడియాలో కనిపించే వీడియోలన్నీ వాస్తవాలు కాకపోవచ్చు. ప్రముఖుల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి మోసాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లు, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నట్లు నమ్మిస్తారు జాగ్రత్త. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయకండి" అని 'ఎక్స్' వేదికగా పోలీసులు తెలిపారు.

డీప్ ఫేక్ టెక్నాలజీతో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది... ప్రముఖుల వీడియోలను మార్ఫింగ్ చేసి విద్వేషాలు సృష్టించేలా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి వీడియోలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని షేర్ చేయవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. ఒకవేళ మీ దృష్టికి నకిలీ వీడియోలు వస్తే, వెంటనే వాటిని రిపోర్టు చేయాలని సూచించారు.


More Telugu News