భారత స్టాక్ మార్కెట్ ర్యాలీ... వరుస నష్టాలకు బ్రేక్

  • కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న బెంచ్‌మార్క్ సూచీలు
  • 446.93 పాయింట్లు పెరిగిన  సెన్సెక్స్
  • 140.20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన లాభాలతో ముగిసింది. గత పలు సెషన్లుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ వేస్తూ, కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్ సూచీలు పుంజుకున్నాయి.

సెన్సెక్స్ 446.93 పాయింట్లు  పెరిగి 81,337.95 వద్ద ముగిసింది. ఉదయం 80,620.25 వద్ద నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, భారీ వెయిటేజ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో 81,429.88 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 140.20 పాయింట్లు (0.57 శాతం) లాభపడి 24,821.10 వద్ద స్థిరపడింది.

అమెరికా-భారత్ వాణిజ్య చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితుల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సానుకూలంగా కోలుకుంది. దాదాపు అన్ని రంగాలు లాభాలతో ముగియగా, ముఖ్యంగా మెటల్, ఫార్మా, రియల్టీ రంగాలు గణనీయమైన లాభాలను ఆర్జించాయి. అయితే, బలహీనమైన త్రైమాసిక ఫలితాల కారణంగా ఐటీ, ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు వెనుకబడ్డాయి.

అమెరికా ఫెడ్ పాలసీ నిర్ణయాలు, ఆగస్టు 1న పరస్పర సుంకాల గడువుతో సహా కీలక అంతర్జాతీయ పరిణామాలకు ముందు పెట్టుబడిదారుల సెంటిమెంట్ అప్రమత్తంగా ఉందని విశ్లేషకులు తెలిపారు.

ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో... టిసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ ప్రధానంగా ఉన్నాయి.

విస్తృత మార్కెట్లో కూడా సానుకూల కదలిక కనిపించింది. నిఫ్టీ నెక్స్ట్ 50 610 పాయింట్లు (0.91 శాతం), నిఫ్టీ 100 158 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 465 పాయింట్లు (0.81 శాతం), నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 186.70 పాయింట్లు (ఒక శాతానికి పైగా) లాభపడ్డాయి.

మెజారిటీ సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 137 పాయింట్లు, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ 85 పాయింట్లకు పైగా, నిఫ్టీ ఆటో 195 పాయింట్లు పెరిగాయి.

అయితే, రూపాయి బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే 0.14 పాయింట్లు తగ్గి 86.80 వద్ద ముగిసింది, ఇది 0.16 శాతం క్షీణత. డాలర్ ఇండెక్స్ 99 మార్కుకు చేరుకోవడంతో దేశీయ మార్కెట్లలోని లాభాలు తేలిపోయాయి.



More Telugu News