ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై కత్తితో కిరాతక దాడి.. దాదాపు తెగిపోయిన ఎడమ చేయి

  • మెల్‌బోర్న్‌లో ఈ నెల 19న ఘటన
  • ఫార్మసీ నుంచి ఔషధాలు తీసుకుని వస్తుండగా ఐదుగురు కుర్రాళ్ల దాడి
  • విరిగిన వెన్నెముక, చేతి ఎముకలు
  • అదే రోజు అడిలైడ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో గత వారం భారత సంతతి వ్యక్తి సౌరభ్ ఆనంద్ (33)పై ఐదుగురు టీనేజర్ల బృందం కత్తితో కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో సౌరభ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఎడమ చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది. వైద్యులు సంక్లిష్ట శస్త్రచికిత్సల ద్వారా చేతిని తిరిగి అతికించారు.

ఈ నెల 19న సాయంత్రం 7:30 గంటల సమయంలో సౌరభ్ ఆనంద్ అల్టోనా మీడోస్‌లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్‌లోని ఫార్మసీ నుంచి ఔషధాలు తీసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తుండగా ఐదుగురు టీనేజర్లు అతడిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు దాడి చేసి అతడి జేబులోని విలువైన వస్తువుల కోసం వెతికాడు. మరొకడు అతడి తలపై బలంగా కొట్టడంతో సౌరభ్ కుప్పకూలిపోయాడు. మూడో వ్యక్తి కత్తి (మాచెట్)ని బయటకు తీసి అతడి గొంతుకు ఆనించాడు.

"మొదటి దాడిలో మాచెట్ నా మణికట్టును తాకింది. రెండోసారి చేయి, మూడో దాడిలో ఎముకను కోసింది" అని బాధితుడు సౌరభ్ వివరించాడు. అతడి భుజం, వీపుపై కూడా గాయాలు అయ్యాయి. దీనివల్ల వెన్నెముక విరిగి, చేతి ఎముకలు పగిలాయి. "నాకు నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది" అని చెప్పాడు.

రెస్క్యూ.. చికిత్స
రక్తస్రావంతో, తీవ్ర నొప్పితో బాధపడుతూనే సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకు వచ్చి "నాపై దాడి జరిగింది, దయచేసి సాయం చేయండి" అని ఆర్తనాదాలు చేశాడు. అక్కడి వారు అతడికి సాయం చేసి, ట్రిపుల్ జీరోకు కాల్ చేశారు.  అతడిని రాయల్ మెల్‌బోర్న్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మొదట అతడి ఎడమ చేతిని తొలగించాల్సి ఉంటుందని భావించారు. అయితే, సంక్లిష్ట శస్త్రచికిత్సల ద్వారా స్క్రూలను ఉపయోగించి చేతిని తిరిగి అతికించారు.

నిందితుల అరెస్ట్
ఆస్ట్రేలియా మీడియా ప్రకారం దాడి చేసినవారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు నిందితులను బెయిల్‌పై విడుదల చేయడంతో సౌరభ్ నిరాశ వ్యక్తం చేశాడు. "నేను న్యాయం కోరుకుంటున్నాను. ఇలాంటి బాధను సమాజంలో ఎవరూ అనుభవించకూడదు" అని పేర్కొన్నాడు. అతడి భాగస్వామి ఆసుపత్రిలో పక్కనే ఉంటూ సేవలు చేస్తోంది. "నేను ఇంటికి తిరిగి వెళ్లడానికి భయపడుతున్నాను. నిద్రపోయే ప్రతిసారీ ఆ దాడి దృశ్యాలు కళ్లముందు కనిపిస్తాయి" అని సౌరభ్ తెలిపాడు.

 
అదే రోజు మరో జాతి విద్వేష దాడి
అదే వారంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో మరో భారతీయుడు చరణ్‌ప్రీత్ సింగ్ (23)పై జాతి విద్వేష దాడి జరిగింది. కింటోర్ అవెన్యూ సమీపంలో ఈ నెల 19న రాత్రి 9:22 గంటల సమయంలో చరణ్‌ప్రీత్ తన భార్యతో కలిసి నగరంలోని లైట్ డిస్‌ప్లేలను చూడటానికి వెళ్లినప్పుడు గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. "ఫ*** ఆఫ్, ఇండియన్" అని జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తూ అతడిపై దాడిచేశారు. కారు పార్కింగ్ వివాదమే ఇందుకు కారణమని తెలిసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చేరాడు. నిందితుల్లో ఒకడిని అరెస్ట్ చేసినప్పటికీ, మిగిలిన వారు పరారీలో ఉన్నారు.  


More Telugu News