నేటి రాత్రి 11 గంటలకు సింగపూర్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు బృందం

  • సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
  • చంద్రబాబు వెంట లోకేశ్, నారాయణ, టీజీ భరత్
  • ఐదు రోజుల పాటు సింగపూర్ లో పర్యటన
  • బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెట్టుబడుల సాధనే లక్ష్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (జులై 26) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్ పయనం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెట్టుబడుల సాధన కోసం చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. 

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. సింగపూర్ లో తెలుగు డయాస్పొరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. 

ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ నుంచి కూడా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి 1,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ భారీ సదస్సుకు సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 

ఏపీ నిరుద్యోగ యువతకు దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వివిధ దేశాల తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములను చేయడంపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 కార్యాచరణలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు. 

పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా ప్రణాళికలపై చర్చించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా... స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శించనున్నారు. 


More Telugu News