Kalisetti Appalanaidu: బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒకటే: టీడీపీ ఎంపీ కలిశెట్టి

Kalisetti Appalanaidu says BRS YCP agenda is the same
  • బీఆర్ఎస్, వైసీపీలు కుమ్మక్కై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయన్న కలిశెట్టి
  • బెంగళూరులో కూర్చొని జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
  • రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్య

బీఆర్‌ఎస్‌, వైసీపీ కుమ్మక్కై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జగన్‌ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకడం, అదే విధంగా కేటీఆర్‌ ఖమ్మం వెళ్లినప్పుడు వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన అన్నారు. స్నేహం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం సరికాదని హెచ్చరించారు.


జగన్‌ బెంగళూరులో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ కుట్రల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా భాగస్వాములవుతున్నారని కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ఐదేళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ రాయలసీమకు ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, సొంత వ్యాపారాలు, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.


ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని... వైసీపీ రాజకీయ కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Kalisetti Appalanaidu
TDP
BRS
YCP
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Godavari River
Political Conspiracy
AP CM

More Telugu News