ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఓఎస్డీల పరస్పర దాడి!

  • కర్ణాటక భవన్‌లో సీఎం ప్రత్యేక అధికారి మోహన్ కుమార్, డిప్యూటీ సీఎం శివకుమార్ ఓఎస్డీ మధ్య ఘర్షణ
  • తనను షూతో కొట్టాడని శివకుమార్ ఓఎస్డీ ఆరోపణ
  • ఆంజనేయనే తనతో దురుసుగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి ఓఎస్డీ ఆరోపణ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ఓఎస్డీలు ఇటీవల ఢిల్లీలో పరస్పరం దాడి చేసుకున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిని అని సిద్ధరామయ్య చెబుతుండగా, కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చెబితే అదే తనకు శిరోధార్యం అని డీకే శివకుమార్ చెబుతున్నారు.

ఈ సమయంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. ఇటీవల ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రత్యేక అధికారులు పరస్పరం దాడి చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సిద్ధరామయ్య వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ కుమార్ అనే అధికారి తనను షూతో కొట్టినట్లు శివకుమార్ వద్ద పనిచేసే ఓఎస్డీ ఆంజనేయ ఆరోపించారు. షూతో కొట్టి పార్టీ నేతల ముందు తన గౌరవానికి భంగం కలిగించారని, అందుకే అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. మోహన్ కుమార్ గతంలోనూ పలువురు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని రెసిడెంట్ కమిషనర్ ఇమ్‌కోంగ్ల జమీర్ వెల్లడించారు.

ఆంజనేయనే తనతో దురుసుగా ప్రవర్తించారని సీఎం ఓఎస్డీ మోహన్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఆయనే తన ఛాంబర్‌లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కార్యాలయంలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగించినట్లుగా తెలుస్తోంది.

ఇరువురు అధికారుల మధ్య జరిగిన ఘర్షణ అంశం తన దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకున్నాక మాట్లాడుతానని తెలిపారు.


More Telugu News