భారత్‌తో నాలుగో టెస్ట్.. సరికొత్త రికార్డులు సృష్టించిన జో రూట్!

  • రికీ పాంటింగ్‌ను దాటి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు
  • ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 1,000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డు
  • అత్యధిక మ్యాచ్‌లలో విజయాలు అందించిన కెప్టెన్‌గా జో రూట్
భారత్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 15,291 పరుగులతో సచిన్ టెండుల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ 200 మ్యాచ్‌లు ఆడి 51 శతకాలతో ఈ పరుగులు పూర్తి చేశాడు.

168 మ్యాచ్‌లు ఆడి 41 శతకాలతో 13,378 పరుగులతో ఇప్పటి వరకు రికీపాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా జో రూట్ ఆయనను మూడో స్థానంలోకి నెట్టేశాడు. జో రూట్ 157 మ్యాచ్‌లు ఆడి 38 శతకాలతో 13,379 పరుగులు చేశాడు. జాక్వెన్ కలీస్ 13,289 పరుగులతో నాలుగో స్థానంలో, రాహుల్ ద్రావిడ్ 13,288 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.

ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోన్న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 1,000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా జో రూట్ రికార్డు సృష్టించాడు. జో రూట్ పేరిట మరికొన్ని ఇతర రికార్డులు కూడా ఉన్నాయి.

జో రూట్ అత్యధిక మ్యాచ్‌లలో (64) ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌కు అత్యధిక మ్యాచ్‌లలో (27) కెప్టెన్‌గా విజయాలు అందించాడు. నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యంలో (454) భాగస్వామి అయ్యాడు. లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు (2,166), అత్యధిక టెస్టు సెంచరీలు (8) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు (211) కూడా జో రూట్ పేరు మీదే ఉంది.


More Telugu News