‘లైంగిక సమ్మతి’ వయసు తగ్గించడంపై కేంద్రం వాదన ఇదే

  • సమ్మతి వయసు తగ్గించే యోచన సరికాదన్న కేంద్రం
  • మైనర్లకు లైంగిక దాడుల నుంచి రక్షణ ఉండదని వాదన
  • పోక్సో చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని వివరణ
బాల్య వివాహాలు, మైనర్లపై లైంగిక దాడుల నుంచి రక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన లైంగిక సమ్మతి వయసును తగ్గించకూడదని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రత్యేక సందర్భాలలో ‘కేస్ బై కేస్’ మినహాయింపులు ఇవ్వడం సముచితమని పేర్కొంది. ఈ వయసు తగ్గించడం వల్ల చిన్నారులను లైంగిక దోపిడీ నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వయసు 18 ఏళ్లను అలాగే కొనసాగించాలని సూచించింది.
 
చిన్నారులపై లైంగిక నేరాలు ఎక్కువగా వారితో నిత్యం సన్నిహితంగా ఉండే వారి వల్లే జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. పిల్లల చుట్టూ ఉండే వారి నమ్మకస్తులే ఎక్కువగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారు, టీచర్లు వంటి వారివల్ల లైంగిక దోపిడీకి గురైన చిన్నారులు తమపై జరిగిన అఘాయిత్యం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదనకు గురవుతారని వివరించింది. ఈ క్రమంలో లైంగిక సమ్మతి వయసు తగ్గించడం వల్ల చిన్నారులకు రక్షణ లేకుండా చేయడమేనని, ఈ దారుణాలకు దారులు తెరవడమేనని వాదించింది.

ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. లైంగిక సమ్మతి వయసును సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. 1860లో ఈ సమ్మతి వయసు 10 ఏళ్లు, 1891 లో దీనిని 12 ఏళ్లకు పెంచారని, 1925 నాటికి 14 ఏళ్లకు, 1940లో 16 ఏళ్లకు, 1978 నుంచి ఈ లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


More Telugu News