మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు పొడిగింపు

  • రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో తీర్మానం
  • స‌భ ఆమోదం.. ఆగస్టు 13 నుంచి అమల్లోకి రానున్న పొడిగింపు
  • వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా, ఆమోదం ల‌భించింది.

కాగా, 2023 మే నెల నుంచి తెగ‌ల‌ మధ్య ఘర్షణలతో మణిపూర్‌ అట్టుడికిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేప‌థ్యంలో 2025 ఫిబ్రవరి 13న సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో కేంద్రం అదే రోజు అక్కడ రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 356 ప్ర‌కారం రాష్ట్రపతి పాలన విధించింది. 

అయితే, ఆ రాష్ట్ర ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2027తో ముగియనుంది. కాగా, రాష్ట్రంలో గత 21 నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు, హింస కారణంగా దాదాపు 250మందికి పైగా మృతిచెంద‌గా, 60వేల‌కు పైగా మంది త‌మ ఇళ్ల‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోయారు. 




More Telugu News