ఈ ఇంజెక్షన్ తో మగపిల్లాడే పుడతాడు... అంటూ దొంగ డాక్టర్ ఘరానా మోసం!

  • తన వద్ద ట్రీట్‌మెంట్ చేయించుకుంటే మగ పిల్లవాడు పుడతాడంటూ మోసం చేస్తున్న నకిలీ వైద్యుడు
  • షాద్‌నగర్ పరిధిలో వెలుగు చూసిన నకిలీ వైద్యుడి దందా
  • ఇటువంటి నకిలీ వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దంటున్న వైద్య నిపుణులు
మగపిల్లాడే పుడతాడంటూ ఓ నకిలీ డాక్టర్ ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు. కర్ణాటకలోని ఏదో యూనివర్సిటీలో బీఏఎంఎస్ పూర్తి చేశానని చెబుతున్న ఆ వైద్యుడు.. మగ సంతానం కావాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నాడు.

షాద్‌నగర్ పరిధిలోని చౌదరిగూడలో ఓ క్లినిక్ నిర్వహిస్తున్న ఈ వైద్యుడు తన వద్దకు మగ పిల్లాడు సంతానంగా పుట్టాలని ఆశపడి వచ్చే దంపతులకు పలు రకాల టెస్టులు చేయించుకోవాలని, అది కూడా తాను చెప్పిన డయాగ్నోస్టిక్ సెంటర్ లోనే చేయించుకోవాలని సూచిస్తాడు. మొత్తం ట్రీట్‌మెంట్ ఖర్చు రూ.34 వేలు అవుతుందని, ముందుగా అడ్వాన్స్ రూపంలో రూ.15 వేలు చెల్లించాలని, మిగతా సగం వారం పది రోజుల్లో చెల్లించాలని చెబుతుంటాడు.

పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు సైతం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. తీరా తన వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న వారికి ఆడపిల్ల పుడితే తాను చెప్పిన డైట్ పాటించలేదని, తాను సూచించిన రోజు ట్రీట్‌మెంట్‌కు రాలేదని, అందుకే అలా జరిగిందని నెపాన్ని వారిపైకే తోసేస్తుంటాడు. ఇతని వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న వారు సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ వద్దకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అతను చదివింది బీఏఎంఎస్ అయితే (ఆయుర్వేద కోర్సు) ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే ఎంతో మందికి వైద్యం చేశానని, 15 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నానని, ఇది తనకు కొత్త కాదని అతను సమర్ధించుకుంటుంటాడు. తప్పుడు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా మగ పిల్లాడు కచ్చితంగా పుడతాడని నకిలీ వైద్యులు చెప్పే మోసపు మాటలు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 


More Telugu News