ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని వేడి చేసి తిని ఒకరి మృతి, ఏడుగురికి అస్వస్థత

  • వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంటలో విషాదం
  • ఆదివారం మటన్, బోటి తెచ్చుకున్న శ్రీనివాస్ యాదవ్ కుటుంబం
  • మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన కుటుంబ సభ్యులు
  • మరుసటి రోజు వేడి చేసుకొని తింటే వాంతులు, విరేచనాలు
హైదరాబాద్‌ నగరంలో బోనాల వేళ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారాన్ని వేడి చేసి భుజించడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంటలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చింతల్‌కుంట ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు ఇంటికి మటన్, బోటి తీసుకువచ్చారు. దానిని రాత్రి వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి భుజించారు. మిగిలిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచారు.

సోమవారం నాడు ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారాన్ని తిరిగి వేడి చేసి కుటుంబ సభ్యులు తిన్నారు. ఆ ఆహారం విషపూరితం కావడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం మృతి చెందారు. మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News