నితీశ్ కుమార్‌ను తప్పించడానికే ధన్‌ఖడ్ రాజీనామా: ఆర్జేడీ

  • సొంత పార్టీ నేతను సీఎం సీట్లో కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోందని వ్యాఖ్య
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రణాళికతో ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించిందన్న ఆర్జేడీ
  • ఆర్జేడీ ఆరోపణలను ఖండించిన బీహార్ ఎన్డీయే నాయకులు
బీహార్‌లో నితీశ్ కుమార్‌ను తప్పించి సొంత పార్టీ నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోందని, అందుకే జగదీప్ ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపించింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాపై విపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.

నితీశ్ కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చడానికి వీలుగా ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించారని ఆర్జేడీ చీఫ్ విప్ అక్తారుల్ ఇస్లాం షాహిన్ అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో వారిలో నిరాశ పెరిగిపోయిందని అన్నారు. చాలా కాలం క్రితం ఒక సీనియర్ బీజేపీ నాయకుడు నితీశ్‌ను తప్పించేందుకు మద్దతు పలికారని గుర్తు చేశారు.

కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మరో అడుగు ముందుకేసి నితీశ్ కుమార్‌ను ఉపప్రధాని చేయాలని సూచించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖడ్ రాజీనామాలో బీజేపీ కుట్ర ఉందని తేలిందని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్‌కు ఉప రాష్ట్రపతి వంటి అప్రధాన్య పోస్టు ఇచ్చి తప్పించాలని చూస్తోందని ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను బీహార్ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీశ్ కుమార్ బీహార్‌ను వీడబోరని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిని విజయబాటలో నడిపించి బీహార్ ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News