సభలో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు: రాహుల్ గాంధీ ధ్వజం

  • నేడు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారన్న రాహుల్
  • ఎన్డీయే ప్రభుత్వం వారికి అనుకూలమైన విధానాలను సృష్టించుకుంటోందని మండిపాటు
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతనైన తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. సభలో అధికార పక్ష సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలోని మంత్రులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి... తనకు మాత్రం తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష నేతగా మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ... మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమేనని రాహుల్ అన్నారు. లోక్ సభలో చర్చ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ వెళ్లిపోయారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అన్ని విషయల్లో వారికి అనుకూలమైన కొత్త విధానాలను సృష్టించుకుంటోందని విమర్శించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ తో పాటు, పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ లోక్ సభలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్ష పార్టీలు ఆందోళనను విరమించాలని లోక్ సభ స్పీకర్ పలుమార్లు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో, స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.


More Telugu News