డబ్ల్యూసీఎల్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై పెదవి విప్పిన షాహిద్ అఫ్రిది

  • పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన భారత ఆటగాళ్లు
  • భారత్ ఈ మ్యాచ్‌ను ఆడకూడదనుకుంటే ముందే చెప్పాల్సిందన్న అఫ్రిది
  • తన వల్లే మ్యాచ్ ఆగిందని తెలిస్తే మైదానానికి కూడా వచ్చేవాడిని కానన్న పాక్ ఆటగాడు
  • శిఖర్ ధవన్‌పై తీవ్ర విమర్శలు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య నిన్న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన మ్యాచ్ తీవ్ర విమర్శల కారణంగా రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగానే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తుండటంతో భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. దీనికితోడు భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన షాహిద్ అఫ్రిది పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తుండటంతో పాక్‌తో ఆడేందుకు విముఖత ప్రదర్శించారు. దీనికితోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డబ్ల్యూటీసీ నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేయడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు. 

మ్యాచ్ రద్దు కావడంపై షాహిద్ అఫ్రిది మౌనం వీడాడు. క్రీడలను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్ ఆడకూడదని అనుకుంటే టోర్నీకి ముందే ఆ నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. కానీ, వారు ఇక్కడికి వచ్చి, ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొని, ఒక్క రోజులో అన్నీ మార్చేశారని విమర్శించాడు. 

శిఖర్ ధవన్‌ను ఉద్దేశించి అతడి పేరు ప్రస్తావించకుండా  ఒక ‘చెడ్డ గుడ్డు’అందరినీ పాడు చేస్తోందని అఫ్రిది వ్యాఖ్యానించాడు. ‘‘క్రీడలు దేశాలను దగ్గర చేస్తాయి. రాజకీయాలు మధ్యలో వస్తే ముందుకు ఎలా సాగుతాం? కమ్యూనికేషన్ లేకుండా సమస్యలు పరిష్కారం కావు. ఇలాంటి ఈవెంట్‌ల ముఖ్య ఉద్దేశం ఒకరినొకరు కలుసుకోవడం, స్నేహపూర్వక సంభాషణలు జరపడం. కానీ కొన్నిసార్లు ఒక చెడ్డ గుడ్డు అంతా పాడు చేస్తుంది” అని పేర్కొన్నాడు.

కాగా, మ్యాచ్‌కు ముందు రోజు శిఖర్ ధవన్ ఎక్స్‌లో ఓ పోస్టును షేర్ చేస్తూ ఈ మ్యాచ్‌లో ఆడబోనని తాను మే 11నే నిర్వాహకులకు చెప్పినట్టు తెలిపాడు. భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. తనకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగారు.   

తన వ్యాఖ్యల వల్లే మ్యాచ్ రద్దు అయిందని తెలిస్తే తాను మైదానానికి కూడా వెళ్లేవాడిని కాదని అఫ్రిది చెప్పాడు.  “నా వల్ల మ్యాచ్ ఆగిపోతుందని తెలిసి ఉంటే, నేను మైదానానికి వెళ్లే వాడిని కాదు. కానీ క్రికెట్ కొనసాగాలి. క్రికెట్ ముందు షాహిద్ అఫ్రిది ఎవరు? ఏమీ కాదు” అని అన్నాడు. “క్రీడగా క్రికెట్ అతిపెద్దది. దీనిలో రాజకీయాలు తీసుకొచ్చి, లేదా ఒక భారత క్రికెటర్ పాకిస్థాన్‌తో ఆడనని చెప్పడం.. అయితే ఆడకండి, ఇంట్లో కూర్చోండి” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ చాంపియన్స్ యజమాని కమిల్ ఖాన్ మాట్లాడుతూ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, రద్దు అయిన మ్యాచ్‌కు సంబంధించి తమ జట్టుకు రెండు పాయింట్లు ఇవ్వబడతాయని చెప్పాడు. “మిగిలిన అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. ఎటువంటి మార్పులు లేవు. సెమీఫైనల్స్, ఫైనల్ విషయంలో, ఒకవేళ రెండు జట్లూ సెమీఫైనల్స్‌కు చేరితే, రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగకుండా చూస్తాం” అని పేర్కొన్నాడు.


More Telugu News