3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా వడ్డీతో సహా చెల్లిస్తాం: ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీ

  • ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్
  • కార్యకర్తల సమావేశంలో కనిపించిన ఫ్లెక్సీ
  • తలపాగా కట్టిన కేటీఆర్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు
  • కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్య
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "లోడింగ్ 3.0" అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఫొటోతో ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. "3.0 లోడింగ్.. 2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం" అనే నినాదంతో తలపాగా కట్టిన కేటీఆర్ ఫొటోను ఆ ఫ్లెక్సీలో ముద్రించారు. పలువురు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీతో సమావేశంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కేటీఆర్ ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వంద సీట్లలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ కూడా ఊహించలేకపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరినీ, ప్రతి రంగాన్ని మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.


More Telugu News