రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మాకైతే తెలియదు.. మీకు తెలుసా?: బాంబే హైకోర్టు ఆగ్రహం

  • వీరసావర్కర్‌కు వ్యతిరేకంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్
  • తన పిటిషన్ రాహుల్ గాంధీ చదివేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన పిటిషనర్
  • రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టేందుకు న్యాయపరమైన అవకాశం ఉందన్న హైకోర్టు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మాకు తెలియదు, మీకేమైనా తెలుసా? అని పిటిషనర్‌ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. వీర సావర్కర్‌‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ తన పిటిషన్ కాపీని చదవాలనే ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ బాంబై హైకోర్టును కోరారు.

అయితే, మీ పిటిషన్‌ను చదవమని రాహుల్ గాంధీని ఎలా బలవంతం చేస్తారని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గందరగోళం సృష్టిస్తున్నారని, ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే విధ్వంసం సష్టిస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఆయన ప్రధాని అవుతారని మీకు తెలుసా అంటూ ప్రశ్నించింది.

అదే సమయంలో, రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు పెట్టేందుకు పిటిషనర్‌కు న్యాయపరమైన అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంశంపై సావర్కర్ మనవడు పుణే కోర్టును ఆశ్రయించగా, అక్కడ దీనిపై విచారణ జరుగుతుందని న్యాయస్థానం గుర్తు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగిందని, అక్కడ ఆ పిటిషన్‌ను కొట్టివేశారని తెలిపింది.

2022లో మహారాష్ట్రలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్ సేవకుడని ఆరోపించారు. బ్రిటిష్ నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీంతో సావర్కర్ మనవడు పుణే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ కొనసాగుతోంది.


More Telugu News