రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
- మృతి చెందిన తొమ్మిది మంది కూలీలు
- ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు
ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.