అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఏఏఐబీ నివేదికపై నిపుణుల విమర్శలు

  • నివేదిక కాలక్రమం.. ముగింపు అసంపూర్తిగా ఉందన్న ఐఏఎఫ్ మాజీ డైరెక్టర్ సంజీవ్ కపూర్
  • పైలట్ మేడేకాల్‌ను సాదాసీదాగా జారీచేయడన్న సంజీవ్
  • ఇంజిన్ల విఫలం వెనకున్న కారణాన్ని నివేదికలో చెప్పలేదన్న నిపుణుడు
అహ్మదాబాద్‌లో గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఇంకా సమాధానం దొరకడం లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదిక రాగా, విమానయాన నిపుణులు దానిని ప్రశ్నిస్తున్నారు.  ప్రమాదం జరిగిన రోజు కాక్‌పిట్‌లో ఏం జరిగిందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

భారత వైమానిక దళ (ఐఏఎఫ్) మాజీ డైరెక్టర్ సంజీవ్ కపూర్ ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రారంభ 15 పేజీల నివేదికను తీవ్రంగా విమర్శించారు. దాని ముగింపు కూడా అసంపూర్ణంగా ఉందని, కాలక్రమం కూడా అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. 

పైలట్ మేడే కాల్‌ను ఎప్పుడూ తేలిగ్గా జారీచేయడని, మేడే అంటే ఏదో ఘోరం జరిగిందనే అర్థమని చెప్పారు. రెండు ఇంజిన్లు విఫలమయ్యాయని చెప్పడంలో సందేహం లేదన్నారు. అయితే, వాటి విఫలం వెనక కారణం మాత్రం ప్రాథమిక నివేదికలో వివరించలేదన్నారు. విమానం కూలడానికి ముందు పైలట్లలో ఒకరు వరుసగా మూడుసార్లు డిస్ట్రెస్ కాల్ చేశారన్న ఏఏఐబీ నివేదికపై సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. ఇంధన సరఫరా ఎందుకు నిలిచిపోయిందని పైలట్లలో ఒకరు ప్రశ్నించడం కాక్‌పిట్ వాయిస్ రికార్డయిందన్నారు. దీని కారణంగానే టేకాఫ్ అయిన తర్వాత ఇంజిన్లు రెండు సెకన్ల వ్యవధిలోనే శక్తిని కోల్పోయాయని తెలిపారు. రెండు ఇంజిన్ల ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఒక సెకనులో ‘రన్’ నుంచి ‘కట్-ఆఫ్’కు మార్చబడ్డాయని, ఫలితంగా విమానం వెంటనే ఎత్తును కోల్పోయిందని నివేదిక పేర్కొందని చెప్పారు. 

టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన కట్-ఆఫ్ స్విచ్‌లను ఆపరేట్ చేస్తాడని చెప్పడం వింతగా ఉందని సంజీవ్ కపూర్ చెప్పారు. విమానాన్ని పైలట్ మాన్యువల్‌గా ఎందుకు లిఫ్టాఫ్ చేస్తాడని ప్రశ్నించారు. ఇంజిన్లను షట్‌డౌన్ చేయడానికి విమానాన్ని 170 డిగ్రీలు ఎందుకు తిప్పుతాడని అన్నారు. ఇది తర్కాలకు విరుద్ధంగా ఉందని చెప్పారు.

ప్రాథమిక ఫలితాలను రూపొందించడానికి పట్టిన సమయాన్ని కూడా సంజీవ్ కపూర్ తీవ్రంగా విమర్శించారు.  కాక్‌పిట్ డేటాను దాదాపు మూడు వారాల క్రితం డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎత్తి చూపారు. "ఈ నివేదిక బయటకు రావడానికి 20 రోజులు పట్టింది, ఇది చాలా ఎక్కువ. వారి వద్ద డేటా ఉన్నందున, ఈ నివేదికలో దాని కంటే చాలా ఎక్కువ వివరాలు ఉండాలి" అని ఆయన ఎత్తి చూపారు.  


More Telugu News