డిగ్రీలు కాదు నైపుణ్యం చూపండి.. ఏడాదికి రూ.40 లక్షల ప్యాకేజీ పొందండి..

  • బెంగళూరు స్టార్టప్ కంపెనీ వినూత్న ఆఫర్
  • సర్టిఫికెట్లు, రెజ్యుమె అక్కర్లేదని సీఈవో ట్వీట్
  • టాలెంట్ ఉంటే ఉద్యోగం మీదేనన్న కామత్
ఉద్యోగ వేటలో రెజ్యుమెకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇంటర్వ్యూ వరకు చేరాలంటే రెజ్యుమె ఆకర్షణీయంగా ఉండాలని హెచ్ ఆర్ మేనేజర్లు చెబుతుంటారు. ఉద్యోగం పొందడంలో రెజ్యుమేను తయారుచేయడమే కీలకమని అనేవారూ ఉన్నారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో సుదర్శన్ కామత్ మాత్రం తనకు ఈ రెజ్యూమె అక్కర్లేదని అంటున్నారు. ఆ మాటకొస్తే మీ అర్హతలు చెప్పే డిగ్రీ సర్టిఫికెట్లు కూడా అవసరంలేదంటున్నారు. సింపుల్ గా మీ టాలెంట్ చూపించి ఉద్యోగం పొందవచ్చని సూచించారు. ఈమేరకు ఆయన తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ట్వీట్ లో కామత్ ఏం చెప్పారంటే..
‘‘డిగ్రీ సర్టిఫికెట్లు, రెజ్యుమె, లింక్డిన్ ప్రొఫైల్.. ఇవేవీ అక్కర్లేదు. మీకు తగిన నైపుణ్యం ఉంటే చాలు. ఏడాదికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తా’’ అంటూ కామత్ ట్వీట్ చేశారు. మీ స్కిల్ చూపించి మెప్పిస్తే ఉద్యోగం మీదే అని చెప్పారు. తన స్టార్టప్ కంపెనీ ‘స్మాలెస్ట్ ఏఐ’ లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్ పోస్ట్ కోసం కామత్ నిరుద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సాంప్రదాయ ఆధారాలు, అర్హతల కంటే అభ్యర్థి నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తూ కామత్ చేసిన ఈ ట్వీట్ పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.


More Telugu News