గోదావరికి భారీగా వరద నీరు... కంట్రోల్ రూం నెంబర్లు ఇవే!

  • ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం
  • అలర్ట్ జారీ చేసిన ఏపీఎస్‌డీఎంఏ
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండి ప్రఖర్ జైన్ శుక్రవారం వెల్లడించారు. నదిలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.2 అడుగులకు చేరుకుందని ప్రఖర్ జైన్ తెలిపారు. అదేవిధంగా, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.9 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.

వరద పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, కొన్ని కీలక సూచనలను ఏపీఎస్‌డీఎంఏ జారీ చేసింది. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. అలాగే, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం వంటివి పూర్తిగా నివారించాలని హెచ్చరించింది. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, ప్రజలు వారి సూచనలను తప్పక పాటించాలని ప్రఖర్ జైన్ కోరారు.


More Telugu News