మహిళా అధికారులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను రద్దు చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

  • తనతోపాటు మహిళా అధికారులను ‘సర్’ అని సంబోధించాలని హసీనా ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఆ ఆదేశాలను రద్దు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
  • ఎలా పిలవాలన్న దానిపై ప్రత్యేక కమిటీని నియమించిన వైనం
  • నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను మధ్యంతర ప్రభుత్వం రద్దుచేసింది. నిన్న జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అధికారులు తనను ‘సర్’ అని సంబోధించాలని హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత మహిళా అధికారులను కూడా అలాగే సంబోధించాలంటూ ఆదేశించారు. హసీనా 16 ఏళ్ల పాలనలో ఇలాగే పిలిపించుకున్నారు. ఇప్పటికీ అక్కడ మహిళా అధికారులను ‘సర్’ అనే సంబోధిస్తున్నారు. ఇలా పిలవడం సామాజికంగా, సంస్థాగతంగా అనుచితమైనదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు చీఫ్ అడ్వైజర్ కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు, భవిష్యత్తులో అధికారులను ఎలా సంబోధించాలన్న దానిపై రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఎనర్జీ, రోడ్లు, రైల్వేలు, పర్యావరణం, నీటి వనరులపై సలహాలు ఇచ్చే సైదా రిజ్వానా హసన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించింది.

కాగా, సలహా మండలి సమావేశంలో ‘సర్’ అని పిలవాలనే నియమాన్ని రద్దు చేయడంతోపాటు ఇతర సంక్లిష్టమైన ప్రొటోకాల్ నియమాలను కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని చర్చించారు. కొత్తగా ఏర్పడిన కమిటీ వాటిని కూడా పరిశీలించి తగిన మార్పులను సూచిస్తుంది. 


More Telugu News